ఇప్పుడు తెలుగుమీడియా వింత పొకడలు పొతొంది. ఒ రకంగా చెప్పాలంటె తెలుగు పత్రికారంగం, తెలుగు చానళ్లు పూర్తిగా జర్నలిజానికి దూరమయ్యాయనె చెప్పాలి. ఇంతకుముందు ఏలా ఉందన్న విషయాన్ని పక్కనపెడితె గత నెలరొజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తె... పై వ్యాఖ్యల్లొని వాస్తవం పూర్తిగా అర్థమవుతుంది. అన్ని చానళ్లు ఏవరొ ఒకరి పక్షాన మాట్లాడుతున్నాయి. కొన్ని చానళ్లు కర్ర విరగకుండా... అన్న సామెతను ఫాలొ అవుతుంటె మరికొన్ని గుడ్డిగా తమ వ్యక్తిగత అజెండాతొ ముందుకు వెళుతున్నాయి.
తాము జర్నలిస్టులమన్న విషయాన్ని, వాస్తవాన్ని పూర్తిగా మరచిపొయి తాము ఓ ప్రాంతానికి ప్రతినిధులుగా భావిస్తూ తమలొని పైత్యాన్ని జనంపై రుద్దెందుకు వారు ఉద్యమస్థాయిలొ ప్రయత్నిస్తున్నారు. తాము చెప్పెవన్నీ వాస్తవాలని నమ్మించెందుకు విశ్వప్రయత్నం చెస్తున్నారు. అయితే తాము తమ వృత్తికి ద్రోహం చేస్తున్నామన్న విచక్షణను మరచిపొతున్నారు. అందుకు ఎన్నో ఉదాహరణలు. ప్రతి ఛానల్‌కు ఓ మోటివ్ ఉండటంలో తప్పులేదు. కానీ అందుకోసం పూర్తిగా ఓ పార్టీకో, ఓ ప్రాంతానికో కరదీపికలుగానో, వాయిస్‌గానో మారాల్సిన పనిలేదు. ఇంత సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో మీడియా పోషించాల్సిన పాత్రేంటి...?
ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగల్చాలా...?
చిన్నచిన్న సమస్యల్నే పెద్దవిగా చేసి చూపాలా...?
ఇష్టం వచ్చినట్లు రాస్తూ/ ప్రసారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టించాలా?
ఇప్పటిదాకా అన్నదమ్ముల్లా ఉన్నవారినే అనుమానాస్పదంగా చూసేలా చేయాలా..?
మనలో ప్రతివ్యక్తి కోరుకునేది ఇలాంటివేవీ జరగకూడదనే. కానీ ఇవేమీ చేయకూడని మీడియా ఇదే చేసి చూపిస్తోంది. చిన్న విషయాన్నే పెద్దది చేస్తూ వివాదం రగుల్చుతోంది. కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని విషంకక్కుతున్నాయి. ఓ ప్రాంతాన్ని హైలైట్ చేస్తూ మిగిలిన ప్రాంతాన్ని తక్కువ చేసి చూపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఓ ఛానల్‌లో ప్రసారమైన వార్తల్లో సీమాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వార్తలు అసలు ఉండవు. ఉన్నా వాటికి లభించే ప్రాధాన్యం అట్టడుగున మాత్రమే. మరో ఛానల్ సమైక్యవాదమంటోంది. ఆ ఛానల్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. ఏవో ఒకటి రెండు మినహా దాదాపు అన్ని ఛానళ్లు ఇదే విధానంతో ముందుకెళుతున్నాయి. అసలు ప్రాంతాలవారీగా విడిపోవాల్సిన దౌర్భాగ్యం తెలుగు ఛానళ్లకు ఎందుకు పట్టినట్లు..?. మిగిలిన మూడు విభాగాలు సరిగా పనిచేసేలా చూడాల్సిన ఫోర్త్ ఎస్టేట్‌ను సరిదిద్దడానికి ఇప్పుడు మరో వ్యవస్థ కావాల్సిన అగత్యం ఏర్పడింది.
తెలంగాణ విడిపోవాలని కోరుకుంటున్న వారి వాదనలో తప్పులేదు. ఆ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి బలైన వారు ఆ కోరిక కోరడాన్ని మనమెలా తప్పుపట్టగలం. కానీ దాన్ని చెప్పాల్సిన విధంగా మీడియా చెప్పాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పే ఓ ఛానల్ అందుకు పూర్తిగా ఆంధ్ర ప్రాంత ప్రజల్ని బాధ్యుల్ని చేస్తోంది. ప్రజలు చేసిన తప్పేంటి...?. రాజకీయ నాయకులు చేసే తప్పుడు పనికి ప్రజల్ని బాధ్యుల్ని చేస్తారా అన్నది ఆ ఛానలే చెప్పాలి. తెలంగాణలో జరిగిన ఉద్యమం బలీయమైనదన్నవిషయంలో సందేహం లేదు. కానీ సీమాంధ్రలో జరిగిన ఉద్యమాన్ని అంత తక్కువ చేసి చూపడం దేనికి. దీనికి ఆ ఛానల్ సమాధానం చెప్పగలదా?. పోనీ ఆ ఛానల్ పూర్తిగా మేము తెలంగాణ వాదానికే కట్టుబడి ఉంటాము అని ధైర్యంగా చెప్పగలుగుతుందా అంటే అదీ లేదు. ఆ చానల్ ప్రసారం చేసిన ఓ కథనంలో సెంట్రల్ యూనివర్శిటీలోనూ ఆంధ్ర వాళ్లే ఎక్కువగా ఉన్నారని రాసింది. అసలు సెంట్రల్ యూనివర్శిటీలో తెలుగు విద్యార్థుల కంటే మిగిలిన వారే అధికం. పైగా వీటిలో అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ పైనే ఆధారపడి ఉంటాయి. ఆ విషయాన్ని కూడా సదరు వ్యక్తులు అదేదే ప్రజల తప్పన్నట్లు చెబితే ఎలాగ...?
మరో ఛానల్ తెలంగాణలో జరిగే ప్రజా ఉద్యమాలను తక్కువ చేసి చూపుతుంది. సీమాంధ్రలో జరిగిన ఉద్యమాన్ని అంత హైలైట్ చేసినప్పుడు మరి తెలంగాణకు అంత విలువ ఇవ్వాలి కదా. విద్యార్థులు ఎక్కడైనా విద్యార్థులే. ఆంధ్ర వర్శిటీలో చేసినా... కాకతీయలో చేసినా... ఓయూలో చేసినా వారి భావోద్వేగాలు వారివి. యువరక్తం వారిది. ఒకరు మంచిగా చేసారన్నప్పుడు రెండోవారిని కూడా అదే విధంగా చూపాలి. అంత బయాస్ పనికిరాదు.
తెలుగు ఛానళ్లు ఇప్పటికైనా మేలుకోవాలి. తమ వార్తలతో రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఎంత అగాధం ఏర్పడుతుందో గుర్తించాలి. తాము అనుసరిస్తున్న విధానం సమాజానికి ఎంత చెరుపు చేస్తుందో తెలియచేయాలి. విడిపోవాల్సిన పరిస్థితే వస్తే సామరస్యంగానే విడిపోదామని చెప్పండి. విడిపోవడంలో తప్పుదేలని చెప్పండి కానీ మీకేంటి నష్టమన్నట్లు వార్తలు రాయకండి. ఇప్పటికే రెండు ప్రాంతాల ప్రజల్లో ద్వేషభావం రగలిపోయింది. దాన్ని చల్లార్చడానికి ప్రయత్నించండి. విద్వేషపూరిత వార్తలతో తాము వృత్తికే కాదు సమాజంలో విషాన్ని విరజిమ్ముతున్నామన్న విషయాన్ని గుర్తించండి.
ప్లీజ్... తెలుగు వారందరం అన్నదమ్ములం. విడిపోతే అలాగే విడిపోదాం. విడిపోయి కలిసుందాం. అంతేకానీ కలిసుండి విడిపోవద్దు. దయచేసి ఛానళ్లు ఈ దిశలో మీ పాత్రను మీరు నెరవేర్చండి.
Tuesday, December 29, 2009
తెలుగు న్యూస్ ఛానళ్లకు విభజన తెగులు
Labels:
andhra,
jai andhra,
jai telanagana,
media,
news channels,
telangana,
telugu
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment